thief: అగ్గిపుల్ల, టపాసులతో షాపులను కొల్లగొడుతున్న దొంగ.. అరెస్ట్ చేసిన పోలీసులకు మరో తలనొప్పి!

  • అగ్గిపెట్టెతో షాపులకు కన్నం
  • పక్కా నిఘాతో అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణలో చుక్కలు చూపిస్తున్న నిందితుడు

అగ్గిపుల్ల.. టపాసులు.. రెండూ ఉంటే ఏం చేస్తాం? చక్కగా టపాసులు కాల్చి ఆనందిస్తాం. కానీ కర్ణాటకకు చెందిన నింగయ్య అలియాస్ మార్క్(30) మాత్రం కాస్త డిఫరెంట్. నింగయ్యకు అగ్గిపుల్ల, టపాసులు కనిపిస్తే చాలు. షాపుల తాళాలను ఇట్టే తెరిచేస్తాడు. ఇలా నింగయ్య  హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో చాలా దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరికి ఎలాగోలా ఇతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించలేక తలలు పట్టుకుంటున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపురం, చిలకలగూడ, తుకారం గేట్, మారేడుపల్లి లోని షాపుల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరిగాయి. దీంతో సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు ఓకే వ్యక్తి ఈ దొంగతనాలన్నింటికి పాల్పడినట్లు గుర్తించారు. చిలకలగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు అగ్గిపుల్ల మందు, టపాసుల్లో ఉండే పొడిని కలిపి తాళంలోని రంధ్రంలోకి వేసి మంట పెట్టగానే తాళం తెరుచుకునేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అనంతరం లోపలకు వెళ్లి కావాల్సిన వస్తువులు, నగదును నింగయ్య తీసుకెళ్లేవాడని వెల్లడించారు. ఈ షాపుల్లో దొంగతనాలు చేసిందని తానేనని నింగయ్య అంగీకరించినట్లు పేర్కొన్నారు.

అయితే నిందితుడు మూగ, చెవిటి కావడంతో విచారణకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. సైగల భాష తెలిసిన వారి సాయంతో విచారణకు ప్రయత్నిస్తున్నా.. నింగయ్య సహకరించడం లేదని వెల్లడించారు. నిందితుడి నుంచి మూడు సెల్ ఫోన్లతో పాటు రూ.11,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News