Andhra Pradesh: మళ్లీ వార్తల్లోకి నూజివీడు ట్రిపుల్ ఐటీ.. పుట్టిన రోజు వేడుకల్లో అర్ధరాత్రి కేకలు, అరుపులు!

  • శ్రుతిమించిన బర్త్‌డే వేడుకలు
  • టమాటాలు, కోడిగుడ్లతో కొట్టుకున్న విద్యార్థులు
  • ఇకపై ఇటువంటి వేడుకలను అనుమతించబోమన్న డైరెక్టర్

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. క్యాంపస్‌లో మతప్రార్థనలు నిర్వహిస్తున్నారంటూ ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల్లా క్యాంపుల్లోకి చొరబడుతున్న పాస్టర్లు అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, మత ప్రచారం నిర్వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు కూడా జరిగింది.

తాజాగా, మంగళవారం అర్ధరాత్రి ఓ విద్యార్థి పుట్టిన రోజును జరుపుకున్న విద్యార్థులు హంగామా చేశారు. అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఔట్ పాస్‌తో బయటకు వెళ్లిన విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా కోడిగుడ్లు, టమాటాలను లోపలికి చేరవేశారు. అర్ధరాత్రి దాటాక వాటిని ఒకరిపై ఒకరు విసురుకుని నానా హంగామా చేశారు. కేకలు, అరుపులతో క్యాంపస్‌లో హోలగోల చేశారు.  

అరుపులు విని డైరెక్టర్ వెంకటదాసు, పీఆర్వో సురేశ్‌బాబు అక్కడికి వెళ్లగా పగిలిన గుడ్లు, టమాటాలు కనిపించాయి. వేడుకల్లో మొత్తం 50 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా సాయంత్రం వేళ నిర్వహించుకోవాలని సూచించారు. అర్ధరాత్రి అరుపులు, కేకలు వేయడం సరికాదన్నారు. ఇటువంటి వేడుకలను ఇకపై అనుమతించబోమని స్పష్టం చేశారు.

More Telugu News