సెట్‌లో సింపుల్‌గా, సరదాగా ఉండేవారు.. నమ్మలేకపోతున్నా: భానుప్రియ

30-08-2018 Thu 07:42
  • మరణవార్త తెలిసి షాకయ్యా
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
  • ఆయనతో కలసి నటించిన భానుప్రియ 
ప్రముఖ నటుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణంపై సీనియర్ నటి భానుప్రియ స్పందించారు. ఆయన మరణ విషయం తెలిసి షాక్‌కు గురయ్యానన్న ఆమె.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. హరికృష్ణ చాలా మంచి మనిషని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని పేర్కొన్నారు. సినిమా సెట్‌లో చాలా సింపుల్‌గా, సరదాగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

హరికృష్ణతో భానుప్రియ రెండు సినిమాల్లో నటించారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. కాగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ అంత్యక్రియలు నేడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు మెహదీపట్నంలోని ఆయన ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.