Vikarabad District: తాండూరులో షికారు చేసిన ‘యమధర్మరాజు’.. హెల్మెట్ పెట్టుకోకుంటే తల పగులుద్దని హెచ్చరిక!

  • హెల్మెట్‌పై పోలీసుల అవగాహన కార్యక్రమం
  • హెల్మెట్ ధరిస్తారా.. యమలోకానికి వస్తారా? అంటూ హెచ్చరిక
  • ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్

వికారాబాద్ జిల్లాలోని తాండూరులో బుధవారం యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. భటులతో కలిసి రోడ్లపై కలియదిరిగాడు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారి వద్దకు వెళ్లి తలపగులుద్దని హెచ్చరించాడు. హెల్మెట్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

యముడు, భటుల వేషధారణలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న వారిని ఆడ్డుకుని హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘హెల్మెట్ ధరిస్తారా.. మాతోపాటు యమలోకానికి వస్తారా?’ అని వాహనదారులను యమధర్మరాజు వేషధారి హెచ్చరించాడు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. హెల్మెట్‌ను ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. రోడ్డు పైకి వచ్చేటప్పుడు ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని, హెల్మెట్ ధరించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.

More Telugu News