Harikrishna: నటుడిగా, చైతన్యరథ సారధిగా, మంత్రిగా... హరికృష్ణ ప్రస్థానం!

  • 1956లో ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించిన హరికృష్ణ
  • పలు చిత్రాల్లో నటించి మెప్పించిన హరికృష్ణ
  • నేడు రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1956 సెప్టెంబర్ 2న ఎన్టీఆర్, బసవతారకం దంపతుల 11 మంది సంతానంలో మూడోవాడిగా జన్మించారు. 1972లో ఆయనకు లక్ష్మితో వివాహం జరిపించగా, జానకి రామ్, సుహాసిని, కల్యాణ్ రామ్, తారక రామ్ (తల్లి షాలిని) జన్మించారు.

1967లో బాలనటుడిగా 'శ్రీకృష్ణావతారం'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆయన, పలు చిత్రాల్లో నటించారు. 'తల్లా పెళ్లామా', 'తాతమ్మకల', 'రామ్ రహీమ్', 'శ్రీరాములయ్య', 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'శివరామరాజు', 'సీతయ్య', 'టైగర్ హరిశ్చంద్రప్రసాద్', 'స్వామి', 'శ్రావణమాసం' చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన 'దాన వీర శూర కర్ణ' చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు.

1980 దశకంలో కాంగ్రెస్ పార్టీ పాలనా విధానాలను వ్యతిరేకిస్తూ, ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించిన వేళ, ఆయన వెన్నంటి నిలిచి, అన్ని అవసరాలనూ చూసుకున్నది హరికృష్ణే. రాష్ట్రమంతా పర్యటించి, ప్రజల్లోకి వెళ్లాలని ఎన్టీఆర్ భావించగా, చైతన్యరథాన్ని సిద్ధం చేయించి, దాన్ని వేల కిలోమీటర్లు స్వయంగా నడిపించారు. ఎన్టీఆర్ కొత్తగా పార్టీని పెట్టి, ఆరు నెలల్లో అధికారంలోకి రావడం వెనుక హరికృష్ణ పాత్ర ఎంతైనా ఉంది. ఓ దశలో ఎన్టీఆర్ కు సినీ వారసుడిగా బాలకృష్ణ, రాజకీయ వారసుడిగా హరికృష్ణ ఉంటారన్న ప్రచారమూ జరిగింది.

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా హరికృష్ణ తన తండ్రిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆ తరువాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ, హరికృష్ణ ఏపీ మంత్రిగానూ కొంతకాలం సేవలందించారు. ఆపై టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలో ఉద్యమం సాగుతున్న వేళ, దాన్ని వ్యతిరేకిస్తూ, 2013, ఆగస్టు 22న తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాడు సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ, రాష్ట్ర పర్యటన సైతం చేశారు.

ఆ తరువాత తన కుమారుడు జానకీరామ్ హఠాన్మరణంతో తీవ్ర మనో వేదనకు గురై, క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించి, తన కుటుంబానికి నందమూరి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చారు.

More Telugu News