Harikrishna: హరికృష్ణ కారు 15 అడుగులు ఎగిరి మా కారుపై పడింది: ప్రత్యక్షసాక్షి కథనం

  • కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం
  • డివైడర్ ను దాటి మా కారు కుడి వైపున తాకింది
  • తన కారు పక్కనే ఉన్న గుంతలోకి పడిపోయిందన్న ప్రత్యక్ష సాక్షి

ఈ ఉదయం నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ, స్వయంగా కారు నడుపుతూ ఘోర ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో వస్తూ, ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి, గాల్లోకి ఎగిరి, డివైడర్ ను దాటి, హైదరాబాద్ వైపు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని నలుగురిలో ఓ వ్యక్తికి గాయాలు కాగా, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అదే కారులోని మరో వ్యక్తి, ప్రమాదంపై తనకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

"మాది హైదరాబాద్. ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాను. పని ముగించుకుని ఐదుగురం కారులో హైదరాబాద్ వైపు వస్తున్నాము. ఉదయం ఆరు గంటలు ... ఆపోజిట్ రోడ్డు నుండి వస్తున్న కారు, డివైడర్ ను దాటి ఎగిరి మా కారుపై పడింది. ఆల్ రెడీ మేము హండ్రెడ్ స్పీడ్ లో ఉన్నాం. మేము నార్మల్ గా వచ్చేస్తున్నాం. సడన్ గా చెట్ల మధ్య నుంచి కారు దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి మా కారుపైకి పడుతూ కనిపించింది.

నేను దాన్ని చూసి, లెఫ్ట్ కు కట్ చేశాను. కారు బాడీ రైట్ సైడ్ కు తగిలింది. నా వెనకాల కూర్చున్న అతనికి దెబ్బలు తగిలాయి. అతనిప్పుడు ఓకే. ఆ కారులో ఉన్నది ఎవరో తెలియదు. మా కారు రోడ్డు దాటి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. మేము డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికే చాలా సేపయింది. మా వాళ్లను చూసుకుని వచ్చేసరికే టైమ్ పట్టింది" అని చెప్పాడు. ఆ తరువాత ప్రమాదానికి గురైన వ్యక్తి నందమూరి హరికృష్ణని తెలిసిందని చెప్పాడు. 

More Telugu News