TTD: నన్ను తొలగించాక గుట్టుగా రూ.30 లక్షలు నా అకౌంట్ లో వేశారు!: రమణ దీక్షితులు

  • దరఖాస్తు చేయకుండానే డిపాజిట్
  • అడిగితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని దాటవేత
  • కోర్టును ఆశ్రయిస్తామన్న దీక్షితులు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా తన బ్యాంకు ఖాతాలోకి టీటీడీ అధికారులు రూ.30 లక్షలు డిపాజిట్ చేశారని రమణ దీక్షితులు ఆరోపించారు. తనకు ఏమాత్రం చెప్పకుండా అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఈ రూ.30 లక్షలు డిపాజిట్ చేశాక ఇవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తాను అసలు దరఖాస్తే చేయలేని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా బాధ్యతల నుంచి తొలగించారన్నారు.

తన నియామకం వంశపారంపర్య హక్కుల కింద జరిగిందనీ, సర్వీస్ రూల్స్ ప్రకారం కాదని రమణ దీక్షితులు తెలిపారు. అందువల్లే గత 30 ఏళ్ల పాటు తనకు ఎలాంటి అలవెన్సులు, ఇతర సదుపాయాలు కల్పించలేదని వెల్లడించారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన అర్చకుల బ్యాంకు ఖాతాల్లోనూ ఇలాగే డబ్బును డిపాజిట్ చేశారని పేర్కొన్నారు.

ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, రసీదులు లేకుండా దరఖాస్తు చేయకుండా అధికారులు ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేశారనీ, టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని రమణ దీక్షితులు అన్నారు. ఈ సమస్యను తాను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానని చెప్పారు. 

More Telugu News