Indian Railways: రైళ్లలోనూ షాపింగ్... డిసెంబర్ నుంచి ఏర్పాటు!

  • డిసెంబర్ నుంచి ప్రారంభంకానున్న ఆన్ బోర్డ్ సేల్స్
  • తొలి దశలో శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఏర్పాట్లు
  • ప్రయాణికుల ఆదరణ చూసి మిగతా రైళ్లలోనూ

రైల్లో గంటల తరబడి ప్రయాణించి విసుగు చెందుతున్నారా? అయితే, కాసేపు అలా ఇలా తిరుగుతూ సరదాగా షాపింగ్ చేసుకోమంటోంది భారతీయ రైల్వే. దూరప్రాంత రైళ్లలో 'ఆన్‌ బోర్డ్‌ సేల్స్‌'ను డిసెంబర్ నుంచి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. తొలుతగా శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో షాపింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణ ఎలా ఉంటుందో పరిశీలించి, మిగతా రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలన్నది రైల్వే శాఖ ఆలోచన.

రైళ్లలో ఏర్పాటు చేసే షాపింగ్ సెంటర్లో సెంట్లు, బ్యాగులు, వాచీలు తదితర అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌ లో షాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ప్రయోజనంతో పాటు రైల్వే శాఖకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్న అంచనాతోనే ఈ ఆలోచన చేసినట్టు చెప్పారు.

 టికెట్ల అమ్మకం మినహా, ఇతర మార్గాల ద్వారా సాలీనా కనీసం రూ. 1200 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) కియోస్క్‌ లు, ఫుట్‌ మసాజ్‌ రోబోటిక్‌ చైర్ లు, మినీ ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

More Telugu News