Telangana: ప్రైవేటు వైద్యుడి నిర్వాకంతో నాలుక పోగొట్టుకున్న యువకుడు!

  • కేన్సర్ ఉన్నా లేనట్టు రిపోర్టు
  • నాలుకను తొలగించిన బసవతారకం వైద్యులు
  • ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బాధిత బంధువుల ఆందోళన

ఓ ప్రైవేటు వైద్యుడి నిర్వాకంతో యువకుడు గొంతు పోగొట్టుకున్న సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్‌ పట్నానికి చెందిన శ్రీనివాస్‌ నాలుకపై ఇటీవల పుండ్లు అయ్యాయి. దీంతో మహబూబాబాద్ వచ్చి ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌ వైద్యుడైన భార్గవ్‌కు చూపించుకున్నాడు. ఈఎన్‌టీ నిపుణుడైన ఆయన శ్రీనివాస్‌ను పరీక్షించి కేన్సర్ అనుమానంతో నాలుకలోని చిన్న ముక్కను కోసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాడు. మూడు రోజుల తర్వాత రిపోర్టు రాగా, కేన్సర్ లేదని తేలింది. దీంతో మందులిచ్చి వాడాలని పంపించేశాడు.

మందులు వాడుతున్నా నాలుకపై పుండ్లు తగ్గకపోవడంతో శ్రీనివాస్ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీనివాస్‌కు కేన్సర్ ఉన్నట్టు తేల్చారు. అక్కడి వైద్యుల సలహా మేరకు శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చి బసవతారకం ఆసుపత్రి వైద్యులను కలిశాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కేన్సర్ నాలుక మొత్తానికి వ్యాపించిందని, తొలగించకుంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పి తొలగించారు.

శ్రీనివాస్ నాలుక పోవడానికి మహబూబాబాద్‌లోని ప్రైవేటు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ సోమవారం అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలంటూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో ఫిర్యాదు చేస్తే వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

More Telugu News