Badminton: చేతులెత్తేసిన సైనా... విజయంతో ఫైనల్స్ లో సింధూ!

  • సెమీస్ కు పరిమితమై కాంస్యంతో సరిపెట్టుకున్న సైనా నెహ్వాల్
  • యమగూచిపై విజయంతో ఫైనల్స్ లో సింధు
  • ఫైనల్ లో తై జూ యింగ్ తో పోరాడనున్న సింధు
  • గెలిస్తే స్వర్ణం, లేకుంటే రజతం ఖాయం

ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పయనం సెమీస్ వరకే పరిమితమైంది. ఈ ఉదయం జరిగిన సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ చేతులెత్తేసింది. చైనీస్ తైపేకు చెందిన తై జు యింగ్ చేతిలో 17-21, 14-21 తేడాతో సైనా ఓడిపోయింది. తొలి గేమ్‌ లో పోరాట పటిమను ప్రదర్శించిన సైనా, రెండో గేమ్‌ లో మాత్రం పదే పదే తప్పిదాలు చేస్తూ, ఓటమిని చవిచూసింది. వరుస రెండు గేమ్‌ లను ఓడిపోయి, మ్యాచ్‌ ను చేజార్చుకున్న ఆమె, తొలిసారిగా ఏషియన్‌ గేమ్స్‌ లో ఫైనల్‌ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. కాంస్య పతకానికే పరిమితమైంది.

ఇదే సమయంలో పూర్తి అటాకింగ్ గేమ్ ను ఆడుతూ, సివంగిలా కోర్టంతా కలియదిరుగుతూ ప్రత్యర్థి అకానే యమగూచిని ముప్పుతిప్పలు పెట్టిన తెలుగుతేజం పీవీ సింధు సగర్వంగా ఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది. తొలి సెట్ ను 21-17 తేడాతో గెలుచుకున్న సైనా, రెండో సెట్ లోనూ తనదైన ఆటతీరును ప్రదర్శించలేక 21-15 తేడాతో ఓడిపోయింది. ఆపై నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సింధూ 9-5 లీడ్ లో ఉన్నప్పుడు 41 స్ట్రోక్ ర్యాలీ జరిగింది. దానిలో గెలిచి 10-5 లీడ్ లోకి వెళ్లిన సింధూ, ఆపైనా అదే ఊపును కొనసాగించింది. 21-10 తేడాతో మూడో సెట్ ను గెలుచుకుంది.

ఫైనల్స్ లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ను ఓడించిన తై జు యింగ్ లు తలపడనున్నారు.

More Telugu News