Uttam Kumar Reddy: టీడీపీతో పొత్తు వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు: ఉత్తమ్ కు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

  • విపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఇరువురి మధ్య చర్చ
  • ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కే నష్టం
  • ముందస్తు ఎంఐఎం ఆలోచన అయి ఉండవచ్చు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి ఉపయోగం ఉండదని ఉత్తమ్ కు లక్ష్మణ్ సూచించారు. హైదరాబాదులో కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ అనంతరం ఉత్తమ్, లక్ష్మణ్ లు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా, టీఆర్ఎస్ ను ఓడించేందుకు అన్ని పార్టీలు కలసి పని చేయాలని ఉత్తమ్ తెలిపారు.

ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కే నష్టం జరుగుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్రం కానీ, బీజేపీ కానీ చేసేదేమీ లేదని లక్ష్మణ్ తెలిపారు. అంతా గవర్నర్, రాష్ట్రపతి, ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ రద్దయినా ఎన్నికలను నిర్వహించాలా? వద్దా? అనే నిర్ణయం ఈసీ చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎంఐఎం ఆలోచనే కావచ్చని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. 

More Telugu News