Tirumala: 45 టన్నుల మలేషియా నాణాలు, 35 టన్నుల భారత నాణాలు... ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటున్న టీటీడీ!

  • రద్దయిన నాణాలను మార్చుకోవడంలో అలసత్వం
  • టన్నుల కొద్దీ పేరుకుపోయిన రింగెట్స్, భారత నాణాలు
  • కరిగించి డబ్బు ఇచ్చేందుకు అంగీకరించని సెయిల్

తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు సమర్పించిన నాణాల విషయంలో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంలా ఉన్న టీటీడీ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. టీటీడీ వద్ద మలేషియా నాణేలు 40 టన్నులు, స్వదేశీ నాణేలు 35 టన్నులకుపైగా పేరుకుపోగా, వాటిని ఎలా మార్చాలో తెలియక టీటీడీ తలపట్టుకుంటోంది. దేశ విదేశాల్లోని భక్తులు, స్వామికి కానుకలు సమర్పించి, వాటిని దైవ కార్యక్రమాలకు వినియోగించాలని కోరుకుంటారన్న సంగతి తెలిసిందే.

అలా వచ్చిన నాణాలు టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్లకు ఏళ్లు నిల్వ ఉండిపోయాయి. 2011లో 25 పైసలు, అంతకన్నా తక్కువ నాణాలను చలామణి నుంచి తొలగించి, ఆపై 2014 ఫిబ్రవరి వరకూ ఆ నాణాలను మార్చుకోవాలని ఆర్బీఐ ఆదేశించినా, తిరుమల అధికారులు మాత్రం మిన్నకుండి పోయారు. గడువు ముగిసిన తరువాత, ఆ నాణాలను తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరించాయి. మలేషియా నాణాల విషయంలోనూ ఇదే పరిస్థితి. మలేషియా రింగెట్లను 2005లో చలామణి నుంచి తొలగించగా, వాటిని మార్చుకోవాలని టీటీడీ భావించలేదు. దీంతో 40 టన్నుల నాణాలు మిగిలిపోయాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత, హుండీలో పడిన రూ. 40 కోట్లను కూడా సరైన సమయంలో మార్చుకునేందుకు టీటీడీ ఆసక్తి చూపలేదన్న సంగతి తెలిసిందే.

కాగా, తమ వద్ద మిగిలిపోయిన నాణాలను కరిగించి, ఆ లోహానికి సమానమైన డబ్బు ఇవ్వాలని టీటీడీ తన ప్రతిపాదనలను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ముందుంచగా, నగదు ఇచ్చేందుకు సెయిల్ అంగీకరించలేదు. తాము డబ్బివ్వలేమని, అందుకు ప్రతిగా, టీటీడీ ఏదైనా యంత్ర పరికరాలను ఆర్డర్ ఇస్తే, డబ్బు తీసుకోకుండా బిల్లులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేయడంతో అందుకు అంగీకరించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

More Telugu News