Hyderabad: వివాదంలో డ్రంకెన్ డ్రైవ్... తాగకపోయినా తాగినట్టు రావడానికి కారణమిదే!

  • గాలిని ఊదే సమయంలో వెనుక వైపు రంద్రాన్ని మూసేస్తున్న పోలీసులు
  • కొంత గాలి లోపలే ఉండిపోతుందంటున్న నిపుణులు
  • మరో వ్యక్తికి పరీక్ష చేసినా, ముందు వచ్చిన ఫలితమే!

అతను తాగాడని బ్రీత్ ఎనలైజర్ వెల్లడించింది. తాగలేదని వైద్యులు తేల్చి చెప్పారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మనవడు జహీరుద్దీన్ ఖాద్రి కేసులో ఇప్పుడు కోర్టు నిర్ణయమే ఫైనల్ కానుంది. హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభించి ఆరున్నరేళ్లు కాగా, ఇంత వివాదం చెలరేగడం ఇదే తొలిసారి.

వాస్తవానికి ప్రతి 100 ఎంఎల్ రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉంటే, సెక్షన్ 185 ప్రకారం కేసు బుక్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. దీనికి వీడియో, బ్రీత్ అనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్ సాక్ష్యం. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల కోసం వినియోగించే యంత్రాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినవని పోలీసులు చెబుతున్నా, వాటిల్లో కొన్ని లోపాలున్నాయి.

శ్వాసను పరీక్షించాలని పోలీసులు భావించిన వ్యక్తితో బ్రీత్ అనలైజర్ పై నుంచి రంద్రంలోకి గాలిని ఊదమంటారు. సదరు వ్యక్తి ఊదే గాలి, ఆ రంద్రం గుండా లోనికి వెళ్లి, దానికి వెనుకవైపున్న రంద్రం గుండా బయటకు వస్తుంది. ఓ వ్యక్తి గాలి ఊదే సమయంలో వెనుక ఉన్న రంద్రాన్ని మూసి పట్టుకుంటే, అతని తరువాత ఊదే వ్యక్తికి కూడా, ముందు పరీక్ష చేయించుకున్న వ్యక్తికి వచ్చిన ఫలితమే వచ్చే అవకాశాలు అధికం.

పరీక్ష చేసే అధికారుల నిర్లక్ష్యం, కొన్నిసార్లు ఉద్దేశ పూర్వకంగా వేలు అడ్డు పెట్టడం వల్ల కొంత గాలి లోపలే ఉండిపోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తాగని వ్యక్తులు తాగినట్టు, తక్కువ తాగిన వ్యక్తులు ఎక్కువగా తాగినట్టు కూడా బ్రీత్ అనలైజర్ మెషీన్లు చూపుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఇటీవలే వెనుక రంద్రాన్ని మూయడానికి ఆస్కారం లేకుండా స్పెషల్ క్లాంప్స్ వేయించామని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

తాజా కేసులో పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారంగా బ్రీత్ అనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్ ను కోర్టుకు సాక్ష్యంగా ఇవ్వనుండగా, జహీరుద్దీన్ దాన్ని సవాల్ చేస్తూ, ఉస్మానియా వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించనున్నాడు. వైద్యుల నివేదికను న్యాయస్థానం అంగీకరిస్తుందా? లేదా? ఈ కేసు ఎంతవరకూ వెళుతుంది? డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల చెల్లుబాటు, మెషీన్ల కచ్చితత్వంపై ఈ కేసు విచారణలో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News