naini narasimha reddy: పార్టీ డబ్బుతోనే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తాం:మంత్రి నాయిని

  • ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం
  • మా కార్యకర్తలే మా భద్రత 
  • కోదండరామ్ తెగిన గాలిపటం వంటి వాడు

వచ్చే నెల 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభను పూర్తిగా పార్టీ డబ్బుతోనే నిర్వహిస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఎవరూ ఇలాంటి సభను నిర్వహించలేదని.. ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని అన్నారు. ప్రగతి నివేదన సభ నిర్వహించే రోజున భారీ భద్రత ఏర్పాటు చేస్తారా?’ అనే ప్రశ్నకు నాయిని స్పందిస్తూ, తమ కార్యకర్తలే తమకు భద్రత అని, పోలీసుల అవసరం అంతగా ఉండకపోవచ్చని, అయినా, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ బందోబస్త్ కూడా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడితే కోర్టుకు వెళతామని తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా నాయిని మండిపడ్డారు. కోదండరామ్ తెగిన గాలిపటం వంటి వాడని, ఎవరో చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని కోదండరామ్ మాట్లాడుతున్నారని నాయిని అన్నారు. ప్రగతి నివేదన సభకు ఏ అధికారిని వినియోగించుకోవద్దని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, ఈ సభ నిర్వహణ విషయంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా అన్నీ పార్టీనే చూసుకుంటుందని, ఈ సభ నిర్వహణ కోసం ఎన్ని పైసలయినా పార్టీనే ఖర్చుపెడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నాయిని విరుచుకుపడ్డారు.‘కాంగ్రెస్ పార్టీ కళ్లు లేని పార్టీ . మొదట కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కళ్ల పరీక్షలు చేయించాలని ముఖ్యమంత్రికి ఇటీవలే చెప్పానని నాయిని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే, రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధి, మంచి పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కనపడటం లేదని, ప్రతిదానికీ వాళ్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెసోళ్లు ఎప్పుడూ నెగెటివ్ మనుషులేనని, అధికార దుర్వినియోగం చేయడం, డబ్బులు కాజేయడం వంటి లక్షణాలు కాంగ్రెస్ నేతలకు ఉన్నాయని, అవే లక్షణాలు తమకు కూడా ఉన్నాయని వారు భావిస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు తమ పార్టీ వ్యూహమని, ఎన్నికలపై పూర్తి అధికారం సీఎం కేసీఆర్ కు అప్పగించామని, ఏ తేదీ చెప్పినా తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.  

More Telugu News