Chandrababu: చంద్రబాబు విజయవాడను బకాసురుల చేతిలో పెట్టారు: సీపీఎం మధు

  • విజయవాడ బకాసుర నగరంగా మారింది
  • మంత్రులు, ఎమ్యెల్యేల కలెక్షన్ ఏజెంట్లు కార్పొరేటర్లు
  • జనసేనతో కలిసి కొత్త రాజకీయ విధానం తీసుకొస్తాం

 సీఎం చంద్రబాబునాయుడుపై సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించిన సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, చంద్రబాబు విజయవాడను బకాసురుల చేతిలో పెట్టారని, బకాసుర నగరంగా మారిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్యెల్యేలకు కలెక్షన్ ఏజెంట్లలా విజయవాడ కార్పొరేటర్లు పనిచేస్తున్నారని, నగరంలో బిల్డింగ్ అనుమతికి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేనతో కలిసి ఏపీలో కొత్త రాజకీయ విధానం తీసుకొస్తామని, ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
 
చంద్రబాబు అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు

సీపీఐ ఏపీ నేత రామకృష్ణ మాట్లాడుతూ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు ఉమ్మడి పోరాటం విజయవాడ నుంచి ప్రారంభమైందని అన్నారు. అవినీతి పనులతో టీడీపీ కార్పొరేటర్లు అభివృద్ధి చెందారని, మొన్నటి వరకు బైక్ లపై తిరిగే కార్పొరేటర్లు, నేడు 'ఆడి' కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీ టీడీపీ లు ఏపీకి తీవ్ర అన్యాయం చేశాయని, రాజకీయాల్లో మార్పు రావాలంటే చంద్రబాబు, మోదీ దిగిపోవాలని అభిప్రాయపడ్డారు.

 అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ తాను అధికారంలోకొస్తే అవినీతి లేని రాష్ట్రాన్ని చేస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలతో జల్సా చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సీసీఐ, సీపీఎం,జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మరోసారి స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని కొండప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకుతింటున్నారని, పార్టీలో ఉన్న అవినీతిపరులను చంద్రబాబు అదుపులో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు అధికారంలోకి రాలేవని జోస్యం చెప్పారు.

More Telugu News