Hyderabad: మద్యం తాగకపోయినా తాగినట్టు చూపించిన బ్రీత్ అనలైజర్... హైదరాబాద్ పోలీసులపై కేసు!

  • సుల్తాన్ బజార్ లో డ్రంకెన్ డ్రైవ్
  • మద్యం తాగకున్నా బీఏసీ 43 చూపించిన బ్రీత్ అనలైజర్
  • వైద్య పరీక్షల్లో మద్యం తాగలేదని నిర్ధారణ 

వింతైన పరిస్థితుల్లో హైదరాబాద్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులపైనే కేసు నమోదైంది. నిన్న రాత్రి సుల్తాన్ బజార్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన సమయంలో, సయ్యద్ జహంగీర్ అనే యువకుడు బైక్ పై వస్తూ కనిపించాడు. ఆ బైక్ ను ఆపిన పోలీసులు, బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ 43 ఉన్నట్టు చూపించింది.

తాను మద్యం తాగలేదని, తనకు ఆ అలవాటు లేదని చెప్పినా పోలీసులు వినలేదు. బలవంతంగా అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఆ వెంటనే జరిగిన ఘటనపై సుల్తాన్ బజార్ లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ లో సయ్యద్ ఫిర్యాదు చేశాడు. తాను తాగకపోయినా, తప్పుడు మెషీన్ తో పరీక్షించి కేసు పెట్టారని అతను ఫిర్యాదు చేయగా, ఆ వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని తీసుకెళ్లారు. ఈ పరీక్షల్లో జహంగీర్ మద్యం తాగలేదని వైద్యులు నిర్ధారించగా, ట్రాఫిక్ పోలీసులపై కేసు నమోదైంది.

More Telugu News