Vijay Malya: బీజేపీ నేతలకు చెప్పే మాల్యా పారిపోయాడు: రాహుల్ గాంధీ

  • బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా
  • ఇండియాను వీడే ముందు బీజేపీ నేతలతో చర్చలు
  • ఆరోపించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యా, దేశం నుంచి పారిపోయే ముందు బీజేపీ నేతలతో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఇండియాను వీడే ముందు కొందరు బీజేపీ నేతలతో మాల్యా చర్చలు జరిపాడని అన్నారు.

అయితే, మాల్యా ఎవరిని కలిశారన్న విషయాన్ని, వారి పేర్లను వెల్లడించని రాహుల్, ఈ చర్చల తరువాతనే మాల్యా పారిపోయాడని అన్నారు. భారతీయ బ్యాంకులను మోసం చేసిన మాల్యా వంటి వారికి బీజేపీ నేతలు సాయం చేశారని రాహుల్ గాంధీ "ఇండియా నుంచి వెళ్లే ముందు కొందరు బీజేపీ నేతలను విజయ్ మాల్యా కలిశారు. నేను వారి పేర్లను వెల్లడించబోను" అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లను బకాయిపడ్డ మాల్యా, మార్చి 2016 నుంచి బ్రిటన్ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News