KCR: తెలంగాణ సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న భయం ఇదొక్కటే!

  • అసెంబ్లీని రద్దు చేస్తే వ్యవహారాలన్నీ ఈసీ పరిధిలోకి
  • ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగకుంటే పరిస్థితి ఏంటి?
  • పూర్తి స్పష్టత వచ్చాకే ముందడుగు వేద్దామంటున్న నేతలు

తమ అధినేత కేసీఆర్ మనసులో ఉన్న ముందస్తు ఎన్నికలను వ్యతిరేకించే ధైర్యం తెలంగాణలోని ఏ మంత్రికి, ఎమ్మెల్యేకు లేకపోయినప్పటికీ, వారిలో ఓ భయం మాత్రం వెంటాడుతోంది. వీలైనంత త్వరగా అసెంబ్లీని రద్దు చేసి, లోక్ సభ ఎన్నికల కన్నా ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తుండగా, అసెంబ్లీ రద్దు జరిగితే ఆపద్ధర్మ ప్రభుత్వమే మిగులుతుందని, అప్పుడు కనీసం ఆరు నెలల పాటు అధికారాలకు దూరమై, కేంద్రం, ఈసీ నియంత్రణలోకి వెళ్లిపోతామన్నది సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం. దీన్ని అలుసుగా తీసుకుని, కేంద్రం ఏదైనా ఎత్తుగడలు వేస్తే, పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే, ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగడానికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అలిపిరి ఘటన తరువాత 2003లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2004 ఏప్రిల్ లో ఎన్నికలు జరుగగా, మే 13న ఫలితాలు వెలువడ్డాయి. ఆ సమయంలో దాదాపు 8 నెలల పాటు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం రద్దయినా, ఆరు నెలల పాటు పదవులు ఉంటాయని కేసీఆర్ అంచనా వేస్తుండగా, ఒకవేళ ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుగకుంటే...? ఇదే ఇప్పుడు అధికారపక్షాన్ని పీడిస్తున్న ప్రశ్న.

ఒకసారి అసెంబ్లీ రద్దు అయితే, ఆపై రాష్ట్ర వ్యవహారాలన్నీ ఈసీ, గవర్నర్ పరిధిలోకి వెళ్లిపోతాయి. అందువల్ల సీఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం అధికార పార్టీపై పడుతుంది. లోక్ సభ ఎన్నికలు జరిపే తేదీలకు కనీసం మూడు, నాలుగు నెలల ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిపించుకోవాలన్నది కేసీఆర్ అభిమతం కాగా, ఏవైనా అనివార్య కారణాలు ఎదురై, మిగతా రాష్ట్రాలతో కలిపి తెలంగాణ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వస్తే ఎలాగన్నది తెరాస నేతల ప్రశ్న. అప్పుడు విధాన నిర్ణయాలపై ఈసీ అజమాయిషీ ఉంటుందని, ప్రజల్లో తెరాస సర్కారుపై ఉన్న ఆదరాభిమానాలు సైతం తగ్గే ప్రమాదముందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఎన్నికలపై పూర్తి స్పష్టత వచ్చిన తరువాతనే అసెంబ్లీ రద్దు గురించి ఆలోచించాలని కొందరు సీనియర్ మంత్రులు కేసీఆర్ కు సూచించినట్టు సమాచారం.

More Telugu News