Olly Esse: ఇటాలియన్ మహిళా డీజేపై ఎయిర్ ఇండియా సిబ్బంది దాడి.. వీడియోలో కన్నీటిపర్యంతమైన ఓలీ!

  • ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘటన
  • తనపై దాడిచేశారన్న ఓలీ 
  • ఖండించిన ఎయిర్ ఇండియా

అతిథి దేవోభవ అన్నది భారతీయ సంస్కృతిలో భాగం. మన దేశానికి వచ్చే విదేశీయులను గౌరవించాలనీ, తద్వారా దేశ గౌరవమర్యాదలు అంతర్జాతీయంగా పెరుగుతాయని భావిస్తాం. అయితే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. విమానం ఆలస్యంపై ప్రశ్నించిన ఓ విదేశీ మహిళపై చేయిచేసుకున్నారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఆమె ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సే తన టూర్ లో భాగంగా భారత్ కు వచ్చింది. పర్యటన తర్వాత ఆగస్టు 19న స్వదేశానికి వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే తాను ఎక్కాల్సిన ఎయిర్ఇండియా విమానం 9 గంటలు లేట్ కావడంతో అక్కడి ఎయిర్ ఇండియా సిబ్బందిని ఆమె ప్రశ్నించింది. అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఒకరు ఈ సందర్బంగా డీజేతో దురుసుగా ప్రవర్తించారు. విమానం ఆలస్యంపై సరిగ్గా జవాబివ్వకుండా ఓలీపై చేయి చేసుకున్నారు.

దీంతో ఈ ఘటనపై డీజే ఓలీ ఎస్సే ఆవేదన చెందుతూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. తనపై ఎయిర్ఇండియా మహిళా సిబ్బంది ఒకరు దాడిచేశారనీ, ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు కూడా అక్కడ లేరని వాపోయింది. మరోవైపు ఓలీ వాదనను ఎయిర్ఇండియా ప్రతినిధి ఖండించారు. ఓలీ ఎయిర్ఇండియా మహిళా సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియో తీసిందని, దీన్ని ఆపాల్సిందిగా మాత్రమే ఆమె కోరిందని వెల్లడించారు. చివరికి ఆ ఫోన్ ను పక్కనపెట్టాలని వీడియో రికార్డును సదరు ఉద్యోగిని అడ్డుకుందన్నారు. ఈ ఘటనకు కారణమైన మహిళ తమ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోందన్నారు.

మరోవైపు ఈ ఘటనపై ఆగస్టు 19న తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీసీటీవీతో పాటు వీడియోను పరిశీలిస్తున్నామనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News