Sim Cards: సిమ్ కావాలా? అయితే.. ఇకపై ఈ రెండూ తప్పనిసరి.. అమల్లోకి కొత్త నిబంధనలు!

  • సిమ్‌ల జారీలో ఇకపై కొత్త నిబంధనలు
  • సెప్టెంబరు 15 నుంచి దశల వారీగా అమలు
  • ఆదేశాలు జారీ చేసిన ఆధార్

ఆధార్ దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) టెలికం ఆపరేటర్లకు సరికొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై సిమ్‌కార్డుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను స్పష్టం చేసింది. సెప్టెంబరు 15 నుంచి ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. యూఐడీఏఐ తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై సిమ్‌కార్డు కోసం ధ్రువీకరణగా ఆధార్ నంబరు ఇచ్చే వినియోగదారుల ఫేషియల్ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ప్రతీనెల జరిగే ధ్రువీకరణల్లో కనీసం పదిశాతం కొత్త నిబంధనల ప్రకారం ఉండాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరించింది.

ప్రస్తుతం టెలికం సంస్థలు కొత్త సిమ్ కార్డు జారీలో వేలిముద్ర, ఓటీపీ, ఐరిస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఇకపై ఫేషియల్ రికగ్నిషన్, లైవ్‌ఫొటో కూడా తీసుకోనున్నారు. వర్చువల్ ఆధార్ కార్డు (వీఐడీ) ఇస్తే కనుక వేలిముద్ర, లేదంటే ఐరిస్ ధ్రువీకరణ సరిపోతుంది. వయసు, ఇతర కారణాల వల్ల వేలిముద్ర, ఐరిస్ తీసుకోలేకపోయిన సందర్భాల్లో ఫేషియల్ రికగ్నిషన్‌ ఆధారంగా ధ్రువీకరించాలని యూఐడీఏఐ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

More Telugu News