kerala: కేరళ ముంపుకు మేము కారణమా?: ఆగ్రహం వ్యక్తం చేసిన పళనిస్వామి

  • ముళ్ల పెరియార్ డ్యామ్ నీటిని వదలడం వల్లే కేరళకు వరదలన్న కేరళ
  • ఒక్క డ్యామ్ నీటిని వదిలితే.. కేరళ మొత్తం మునిగిందా అన్న పళనిస్వామి
  • మూడు సార్లు హెచ్చరించిన తర్వాతే నీళ్లు వదిలామన్న సీఎం

వరదలు తగ్గుముఖం పట్టడంతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రంలో పునరావాస కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై కేరళ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు అధీనంలో ఉండే ముళ్ల పెరియార్ డ్యామ్ వల్లే కేరళను వరదలు సర్వనాశనం చేశాయంటూ కేరళ ఆరోపించింది. అంతేకాదు, ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది.

ఈ నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. కేరళ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. కేరళ వరదలకు, తమకు సంబంధం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పెరియార్ డ్యామ్ నుంచి నీళ్లను వదిలితే... మొత్తం కేరళ మునిగిపోయిందా? అని పళనిస్వామి ప్రశ్నించారు. కేరళలోని 80 డ్యామ్ ల నుంచి ఒక్కసారిగా నీటిని వదలడంతోనే, జలప్రళయం సంభవించిందని చెప్పారు.

కేరళలో వరదలు వచ్చిన వారం రోజుల తర్వాతే తాము ముళ్ల పెరియార్ నుంచి నీటిని వదిలామని తెలిపారు. వరదలు వచ్చిన వెంటనే నీటిని విడుదల చేయలేదని... డ్యామ్ కు ఇన్ ఫ్లో ఎక్కువ అయిన తర్వాతే దిగువకు నీటిని వదలాల్సి వచ్చిందని చెప్పారు. నీటి విడుదలకు ముందు కూడా కేరళకు మూడు సార్లు హెచ్చరికలను జారీ చేశామని తెలిపారు. ఒక్కసారిగా తాము నీటిని వదల్లేదని... దశలవారీగానే వదిలామని చెప్పారు.

More Telugu News