Ranadeep: కేరళ వెళ్లి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న బాలీవుడ్ హీరో.. నెటిజన్ల ప్రశంసలు!

  • వరద బాధితులకు భోజనం వడ్డించిన హీరో రణ్‌దీప్‌
  • నిజమైన హీరో అని మెచ్చుకుంటున్న నెటిజన్లు 
  • హీరోయిజం అంటే సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టడమే కాదు  

బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హుడా రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. కేరళ వెళ్లి అక్కడ పునరావాస కేంద్రాల్లో వున్న వరద బాధితులకు సహాయం చేస్తూ, దగ్గరుండి వారికి భోజనం కూడా వడ్డించాడు. ‘ఖల్సా ఎయిడ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆయన కేరళ వరద బాధితులకు చేసిన సేవను చూసిన జనాలు ఫిదా అయ్యారు. 'హీరో అంటే అలా వుండాలి' అంటూ నెటిజన్లు తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.  

వరద బాధితుల కోసం ‘ఖల్సా ఎయిడ్ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ  ప్రారంభంలో 2 వేల మందికి భోజనం పెట్టింది. తరువాత విరాళాలు కూడా రావడంతో ఇప్పుడు దాదాపు 15 వేల మందికి భోజనం అందిస్తోంది. రణ్‌దీప్‌ ఈ సంస్థతో కలిసి సామాన్యుడిలా చేసిన సేవ చూసిన నెటిజన్లు స్పందిస్తూ, 'సహాయం చేయండని చెబుతూ సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇవ్వడం హీరోయిజం కాదు... ఇలా  సామాన్యుడిలా సహాయం చేయడమే హీరోయిజం' అంటూ ప్రశంసిస్తున్నారు. గతంలో కూడా రణ్‌దీప్‌ ముంబై బీచ్ ను శుభ్రం చేయడానికి స్వయంగా వెళ్ళాడు. ఇక కోటి రూపాయల భారీ సహాయం ప్రకటించి, ఉదారతను చాటుకున్న లారెన్స్ కూడా త్వరలో వరద బాధితులకు సేవ చేసేందుకు వెళతానని ప్రకటించిన సంగతి విదితమే.

More Telugu News