honey trapping: వ్యాపారిని ‘హనీ ట్రాప్’ చేసిన పోలీస్.. కటకటాల వెనక్కి నెట్టిన అధికారులు!

  • దేశ రాజధానిలో ఘటన
  • వ్యాపారిని ట్రాప్ చేసిన కానిస్టేబుల్
  • అరెస్ట్ చేసిన అధికారులు

అతనో కానిస్టేబుల్. ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. కానీ రాత్రికిరాత్రే భారీగా నగదు కూడబెట్టాలన్న అత్యాశతో వ్యాపారులకు అమ్మాయిలను ఎరగా(హనీ ట్రాప్) వేసి ఆపై బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ప్రబుద్ధుడిని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఢిల్లీలోని రోహిణి విజయ్ విహార్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ భారీగా డబ్బును సంపాదించేందుకు అడ్డదారులు తొక్కాడు. వ్యాపారులను, ఇతర ప్రముఖులను అమ్మాయితో తెలివిగా ట్రాప్ చేయించాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు తీయించి, వారిద్దరి మధ్య జరిగే చాటింగ్ లను రికార్డు చేసేవాడు. చివరికి వీటిని కుటుంబ సభ్యులకు చూపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు.

దీంతో చాలామంది పరువు పోకూడదన్న ఉద్దేశంతో అతను చెప్పిన మొత్తం ఇచ్చుకుని సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో మరో వ్యాపారిని ఇదే తరహాలో ట్రాప్ చేసిన నిందితుడు.. రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నగదు ఇవ్వకుంటే తప్పుడు రేప్ కేసు పెట్టి జైలుపాలు చేస్తానని హెచ్చరించాడు. అయితే కానిస్టేబుల్ కు రూ.3 లక్షల వరకూ చెల్లించిన సదరు వ్యాపారి.. ఇక వేధింపులు ఎక్కువ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు.

తనకు సదరు యువతి ఫేస్ బుక్ లో కొన్నిరోజుల క్రితం పరిచయం అయిందని చెప్పాడు. తామిద్దరం కొన్నిసార్లు మాత్రమే కలుసుకున్నామని వెల్లడించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. అంతేకాకుండా విధుల నుంచి అతడిని తొలగించారు. కాగా, ఈ ఘటనలో కీలకంగా ఉన్న యువతి, ఇతరులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

More Telugu News