New Delhi: నిర్లక్ష్యంగా ఇంజెక్షన్ చేసిన ఆసుపత్రి.. రూ.20 లక్షలు చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం!

  • దేశ రాజధానిలో ఘటన
  • నరానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ 
  • నాలుగు వేళ్లు కోల్పోయిన బాలుడు

ఓ వ్యక్తికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి, వైద్యుడిపై వినియోగదారుల ఫోరం కొరడా ఝళిపించింది. బాధితుడికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన అమ్రీష్ కుమార్ అనే బాలుడు జ్వరంతో 2001లో ఇక్కడి విమ్ హాన్స్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో చికిత్స ప్రారంభించిన వైద్యుడు డా. అజయ్ కుమార్ సిన్హా నరానికి చేయాల్సిన ఇంజెక్షన్ ను చేతి కండకు ఇచ్చారు. దీంతో సదరు బాలుడి ఆరోగ్యం మరింత క్షీణించింది.

దీంతో బాలుడి తల్లిదండ్రులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు చేతికి గ్యాంగ్రీన్ కావడంతో కుడిచేతి నాలుగు వేళ్లను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సదరు బాలుడికి 29 శాతం శారీరక వైకల్యం సంభవించింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఈ వ్యవహారంలో వైద్యుడు, ఆసుపత్రి నిర్లక్ష్యం ఉన్నట్లు తేల్చింది. బాధితుడికి నష్టపరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని ఫోరం సభ్యుడు ఎన్ పీ కౌశిక్ ఆదేశించారు. ఈ మొత్తంలో 80 శాతం నగదును వైద్యుడు, మిగిలిన మొత్తాన్ని విమ్ హాన్స్ ఆసుపత్రి చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News