germany: ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తే ఐసిస్ లాంటి సంస్థలు పుడతాయ్!: కాంగ్రెస్ నేత రాహుల్ హెచ్చరిక

  • దళిత, ఆదివాసీ, మైనారిటీలపై కేంద్రం వివక్ష
  • మూకహత్యలకు నిరుద్యోగం ఓ కారణమే
  • జర్మనీలోని హాంబర్గ్ లో రాహుల్ ప్రసంగం

మోదీ ప్రభుత్వం ఆదివాసీలు, దళితులు, మైనారిటీలను అభివృద్ధి ప్రక్రియకు దూరం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. 2003లో ఇరాక్ లో అమెరికా దాడి, ఆధిపత్యం తర్వాత ఇరాక్ లో ఓ తెగవారిని ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్మీలో చేరకుండా నిషేధం విధించారని గుర్తుచేశారు. దీని కారణంగా ఈ తెగవారు భారీగా తిరుగుబాటుదారుల్లో చేరారనీ, అది అంతిమంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) వంటి భయంకరమైన ఉగ్రసంస్థ పుట్టుకకు కారణమైందని వ్యాఖ్యానించారు. మెజారిటీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తే ఐసిస్ వంటి ప్రమాదకర ఉగ్ర సంస్థలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ లో ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నాయని రాహుల్ విమర్శించారు.

జర్మనీలోని హాంబర్గ్ లో ఉన్న బుసెరియస్ సమ్మర్ స్కూల్ లో జరిగిన ఓ సదస్సులో రాహుల్ మాట్లాడారు. 21వ శతాబ్దంలో ప్రజలను అభివృద్ధికి దూరం చేయడం సరికాదని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదలకు అవకాశాల లేమి కారణంగా ఏర్పడుతున్న ఆగ్రహంతోనే మూకహత్యలు జరుగుతున్నాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కారణంగా దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు పూర్తిగా నాశనమయ్యాయని రాహుల్ ఆరోపించారు.

More Telugu News