Kerala: వరద దృశ్యాలు చూసి.. దాచుకున్న డబ్బులు ఇచ్చేసిన చిన్నారి!

  • కేరళకు నాలుగేళ్ల చిన్నారి సాయం 
  • పిగ్గీ బ్యాంక్ లో దాచుకున్న రూ.14800 ఇచ్చిన అపరాజిత 
  • కోల్‌కతాలోని సీపీఎం పార్టీ ఆఫీస్ లో నగదు అందజేత

కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిన్నారి పెద్దమనసు చాటుకుంది. 'కేరళలో ఉన్న నా సోదరీమణులకు ఈ నగదును అందించండి' అంటూ నాలుగేళ్ల చిన్నారి పిగ్గీ బ్యాంక్ లో దాచుకున్న నగదును కేరళ వరద సాయంగా అందించింది. అపరాజిత అనే పాప తన తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన డబ్బును తన పిగ్గీ బ్యాంక్ లో దాచుకుంది. టీవీ లో కేరళ వరద దృశ్యాలు, అక్కడ ప్రజలు, చిన్నారులు పడుతున్న ఇబ్బందులను చూసి తన పిగ్గీ బ్యాంక్ లో ఉన్నరూ.14800లను  కేరళ వరద సహాయ నిధికి అందించింది.  

పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ కు చెందిన అపరాజిత నృత్యం నేర్చుకోవడానికి ఒక సీడీ ప్లేయర్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఈ డబ్బులు దాచుకుంటోంది. ఆ డబ్బులను ఇప్పుడు కేరళకు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది. సీపీఎం పార్టీ విరాళాలు సేకరిస్తోందన్న సమాచారంతో అపరాజిత తన తల్లిదండ్రులతో కలిసి కోల్‌కతాలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బిమన్‌ బోస్‌కు ఆ నగదును అందజేసింది. కేరళ వరద దృశ్యాలను చూసి పాప చలించిపోయిందని, అందుకే తాను దాచుకున్న డబ్బు ఇచ్చేసిందని తల్లిదండ్రులు తెలిపారు.  

More Telugu News