petrol dealers: మీ ఉద్యోగుల కులం, మతం వివరాలు ఇవ్వండి!: ఆయిల్ డీలర్లకు కంపెనీల ఆదేశం

  • అంగీకరించని ఆయిల్ డీలర్ల సంఘాలు
  • వ్యక్తిగత గోప్యతకు భంగకరమని స్పష్టీకరణ
  • హరియాణాలో ఆయిల్ సప్లై నిలిపివేసిన కంపెనీలు

ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు, పెట్రోల్ డీలర్లకు మధ్య మరో వివాదం తలెత్తింది. తమ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కులం, మతం, నియోజకవర్గం వివరాలను వెంటనే సమర్పించాలని ఆయిల్ సంస్థలు ఆదేశించడమే దీనికి కారణం. అయితే ఉద్యోగుల వివరాలు వెల్లడించడం వ్యక్తిగత గోప్యతకు భంగమని చెప్పిన డీలర్ల యూనియన్.. ఏ ఒక్కరి వివరాలను ఇవ్వబోమని ప్రకటించింది.

పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని జూన్ 11నే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) , పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కు లేఖ రాశాయి. దీనిపై మండిపడ్డ డీలర్లు తమ ఉద్యోగుల వివరాలను ఇవ్వబోమని ప్రకటించారు. దీంతో హరియాణాలో కొందరు డీలర్లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై పెట్రోల్ డీలర్లు మండిపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల వివరణ మాత్రం ఇంకోరకంగా ఉంది. పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ పథకం కింద ట్రైనింగ్ ఇచ్చేందుకే 24 అంశాల్లో సమాచారం కోరామని కంపెనీలు తెలిపాయి. కానీ డీలర్ల సంఘాలు మాత్రం తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించలేదని వ్యాఖ్యానించాయి.

More Telugu News