Rahul Gandhi: 2019 ఎన్నికలు ‘భారత్ వెలిగిపోతోంది’ పార్ట్-2: కాంగ్రెస్

  • పొత్తుల విషయంలో పట్టువిడుపులు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 240 కంటే తక్కువ సీట్లు వస్తే అధికారం కల్లే
  • వ్యూహాలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కల్లే అని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో 2004లో ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ముందస్తుకు వెళ్లిన బీజేపీ ఓటమి పాలైందని, వచ్చే ఎన్నికలు బీజేపీకి ‘ఇండియా షైనింగ్’ పార్ట్-2 లాంటివని రాహుల్ భావిస్తున్నట్టు సమాచారం. 240 కంటే తక్కువ సీట్లు కనుక బీజేపీకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని అంటున్నారు.

బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు పొత్తుల విషయంలో ప్రాంతీయ పార్టీలతో పట్టువిడుపులతో వ్యవహరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత వెల్లడించారు. గత ఎన్నికల్లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో 120 స్థానాలకు గాను బీజేపీ 93 సీట్లు గెలుచుకుంది. దీంతో ఈసారి ఆ రెండు రాష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీ, బీఎస్‌పీ, బీహార్‌లో ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే బీజేపీని ఓడించడం ఏమంత కష్టం కాదని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇదే ఫార్ములాతో మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, రాజస్థాన్‌లోనూ ఎన్నికలకు వెళితే బీజేపీకి అడ్డుకట్ట వేయవచ్చని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

More Telugu News