kohli: టెస్ట్ గెలుపు కేరళకు.. నా ఇన్నింగ్స్ అనుష్కకు అంకితం: కోహ్లీ

  • కేరళ ప్రజలకు మేమిస్తున్న చిరు కానుక ఈ విజయం
  • అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించాం
  • టెస్ట్ సిరీస్ గెలుస్తామనే నమ్మకం మాకుంది

ఇంగ్లండ్ తో నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. టీమ్ సభ్యులంతా కలసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపాడు. కేరళ ప్రజలు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారని... వారికి మేము అందిస్తున్న చిరు కానుక ఈ విజయమని చెప్పాడు.

మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ, అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని తెలిపాడు. ఇది తమకు ఒక 'కంప్లీట్ టెస్ట్ మ్యాచ్' అని చెప్పాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసినప్పుడు వారికి సహకారం అందించాల్సిన బాధ్యత జట్టులోని బ్యాట్స్ మెన్ పై ఉంటుందని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.

తొలి ఇన్నింగ్స్ లో భోజన విరామానికి కొంత సేపు ముందు పుజారా ఔటైన తర్వాత రహానే అద్భుతంగా ఆడాడని కోహ్లీ ప్రశంసించాడు. రహానే ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాడని... ఆట స్వరూపాన్ని మార్చగలిగే సత్తా అతనికి ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ కు మంచి బౌలింగ్ అటాక్ ఉందని, దాన్ని ఎదుర్కొని పరుగులు సాధించాల్సి ఉంటుందని... తొలి ఇన్నింగ్స్ లో రహానే, రెండో ఇన్నింగ్స్ లో పుజారా అదే చేశారని తెలిపాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ఆత్మవిశ్వాసం తమకు ఉందని చెప్పాడు.

తన ఇన్నింగ్స్ ను తన భార్య అనుష్క శర్మకు అంకితమిస్తున్నానని కోహ్లీ తెలిపాడు. ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని, తనలో స్ఫూర్తిని నింపిందని చెప్పాడు. తనను పాజిటివ్ గా ఉంచే శక్తి ఆమెకు ఉందని అన్నాడు. 

More Telugu News