Chandrababu: తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై చర్చించిన చంద్రబాబు

  • అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో చర్చ  
  • ‘కాంగ్రెస్’తో వ్యవహరించాల్సిన వైఖరిపై సమాలోచనలు
  • తెలంగాణలో పొత్తు, ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తావన

తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై తమ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారితో చర్చించి, సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం.

 ఈ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఆనందబాబు, కాలవ శ్రీనివాసులు, సుజయకృష్ణ రంగారావు, లోకేశ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు అంశంపై, ముందస్తు ఎన్నికల అంశంపై, ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ విధానంపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

అంతేకాకుండా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో వ్యవహరించాల్సిన వైఖరిపై చంద్రబాబు సమాలోచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. పొత్తులపై టీ-టీడీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఉభయతారకంగా ఉండేలా పొత్తులు ఉంటే బాగుంటుందని, ఏపీలో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తగ్గిందని నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందని, ఆ పార్టీ ప్రాభవం రోజురోజుకూ జాతీయస్థాయిలో తగ్గుతోందన్న విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం.

More Telugu News