Moon: నిజమే.. చంద్రుడిపై మంచు ఉంది!: 'చంద్రయాన్' సమాచారాన్ని ధ్రువీకరించిన నాసా

  • ఈ విషయాన్ని అప్పట్లో చంద్రయాన్ బయటపెట్టింది   
  • ‌చంద్రుడిపై ఆవాసాలకు ఇది ఉపయుక్తం 
  • నాసా విశ్లేషణలో వెల్లడి

చంద్రుడి ధ్రువప్రాంతపు ఉపరితలంపై మంచు పొరలు వున్న మాట నిజమేనని నాసా ప్రకటించింది. పదేళ్ల క్రితం మన అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో పంపిన ‘చంద్రయాన్‌ 1’ అంతరిక్ష వాహక నౌక చంద్రుడిపై మంచు ఉందన్న విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా కూడా ‘చంద్రయాన్‌ 1’ సమాచారం నిజమేనని ధ్రువీకరించింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంచంతా ఒకేచోట ఉండగా, ఉత్తర ధ్రువంపై మాత్రం అక్కడక్కడా పోగుగా ఉందని తేల్చింది. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఘనీభవ స్థితిలో ఉన్న ఈ మంచు ఎంతో ఉపయుక్తమవుతుందని స్పష్టం చేసింది. చంద్రుడి ధ్రువప్రాంతాల్లో ఈ మంచు పేరుకుపోయి ఉందని, ఉపరితలం అడుగులో పేరుకుపోయి ఉన్న మంచు కంటే దీన్ని వినియోగించుకోవడం సులువని తెలిపింది. నాసాకు చెందిన మూన్‌ మినరాజీ మ్యాపర్‌ (ఎం3) పంపిన డేటా ఆధారంగా చంద్రుడిపై మంచు విషయాన్ని శాస్త్రవేత్తలు  ధ్రువీకరించారని పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌ ప్రచురించింది.

 వాస్తవానికి ఎం3ని చంద్రుడిపైకి మోసుకెళ్లింది కూడా మన చంద్రయాన్‌ స్పేస్‌క్రాప్టే. చంద్రుడి కక్ష్యలో ఉన్న వంపుకారణంగా ధ్రువాల్లోని అర్ధచంద్రాకారపు భారీలోయల్లో ఈ మంచు పేరుకుపోయినట్లు గుర్తించారు. సూర్యకిరణాలెప్పుడూ పడక పోవడం వల్ల ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ మైనస్‌ 156 డిగ్రీల కంటే ఎక్కువ ఉండదని తేల్చారు. 

More Telugu News