Andhra Pradesh: ఏపీ జర్నలిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కం వెబ్‌సైట్ ప్రారంభం

  • పేర్ల నమోదుకు ప్రత్యేక వెబ్ సైట్  
  • ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రక్రియ‌ను ప్రారంభించిన మంత్రి
  • జర్నలిస్టుల కుటుంబ సభ్యుల పేర్లతో స్థలం ఉన్నా రాయితీ వర్తిస్తుంది: మంత్రి కాలవ

రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కంలో భాగంగా అర్హులైన జ‌ర్నలిస్టుల వివ‌రాల‌ను ఆన్‌లైన్ లో న‌మోదు చేసే ప్రక్రియ ఈరోజు ప్రారంభ‌మైంది. రాష్ట్ర స‌మాచార పౌర‌సంబంధాలు, గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖ మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు స‌చివాల‌యంలోని ప‌బ్లిసిటీ సెల్‌లో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వెబ్ సైట్ www://apgovhousing.apcfss.in/journalist housing ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, జర్నలిస్టులకు సొంతిల్లు ఉండాలనే కలను సాకారం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ స్కీమ్ రూపకల్పన చేశామని, ప్రభుత్వం అమలు చేస్తున్న పక్కా ఇళ్ల పథకంలో జర్నలిస్టులను లబ్దిదారులను చేస్తున్నామని అన్నారు. ఒకవేళ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల పేర్లతో స్థలం ఉన్నా, రాయితీ వర్తిస్తుందని కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో స‌మాచార‌ శాఖ జారీ చేసిన అక్రిడిటేష‌న్ క‌లిగి వున్న అర్హులైన జ‌ర్నలిస్టులంతా ఇక‌పై ప‌క్కాగృహాల మంజూరు కోసం త‌మ వివ‌రాల‌ను ఈ వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాల్సి వుంటుంద‌ని  కాల‌వ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. జ‌ర్నలిస్టులు ముందుగా త‌మ అక్రిడిటేష‌న్ నెంబ‌రు, మొబైల్ నెంబ‌రు న‌మోదు చేస్తే ఒన్‌టైమ్ పాస్‌వ‌ర్డ్‌ (ఓటీపీ) త‌మ మొబైల్‌కు వ‌స్తుంద‌ని, ఆ ఓటీపీని వెబ్‌సైట్‌లో న‌మోదు చేయ‌గానే ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ఫారం ప్రత్యక్షమ‌వుతుంద‌ని, అందులో త‌మ వివ‌రాలు న‌మోదు చేయాల్సి వుంటుంద‌ని చెప్పారు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ఫారంను ఒక కాపీ ప్రింట్ తీసుకొని దానిపై సంబంధిత ద‌ర‌ఖాస్తు కాపీని జిల్లా పౌర‌సంబంధాల అధికారి, స‌హాయ సంచాల‌కులు లేదా ఉప సంచాల‌కుల‌కు అంద‌జేయాల్సి వుంటుంద‌ని అన్నారు.ఈ సంద‌ర్భంగా విలేకరులతో కాలవ మాట్లాడుతూ, జ‌ర్నలిస్టుల గృహ‌ నిర్మాణాన్ని జ‌ర్నలిస్టులు త‌మ పేరుతో ఇంటి ప‌ట్టా లేన‌ప్పటికీ వారి కుటుంబ‌స‌భ్యుల పేరుతో ఇళ్ల ప‌ట్టా వున్నా రాయితీ వ‌ర్తించే విధంగా వెసులుబాటు క‌ల్పించ‌నున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జ‌ర్నలిస్టుల సొంత ఇంటిక‌ల‌ను నిజంచేసే ల‌క్ష్యంతో వున్నార‌ని, రాష్ట్రంలోని జ‌ర్నలిస్టులంతా ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. ఈ ప‌థ‌కాన్ని త్వర‌గా అమ‌లు చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే ప్రభుత్వం రూ.100 కోట్లు విడుద‌ల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జ‌రిగింద‌ని చెప్పారు. వీలైనంత స‌ర‌ళ‌త‌ర‌మైన నిబంధ‌న‌ల‌తో అర్హులైన వారికి ఇబ్బందులు క‌ల‌గ‌ని రీతిలో ఈ ప‌థ‌కాన్ని రూప‌క‌ల్పన చేశామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార‌శాఖ క‌మిష‌న‌ర్ ఎస్‌.వెంక‌టేశ్వర్‌, సంయుక్త సంచాల‌కులు పి.కిర‌ణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Telugu News