Narendra Modi: ప్రత్యేక ఆహ్వానితుడుగా అయితే రాలేను!: ప్రధానికి కాంగ్రెస్‌ నేత ఖర్గే లేఖ

  • లోక్‌పాల్‌ కమిటీ సమావేశానికి ఆహ్వానం 
  • పూర్తి స్థాయి సభ్యుడి హోదా డిమాండ్  
  • ఇది నాలుగో లేఖ 

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి మరో లేఖాస్త్రం సంధించారు. లోక్‌పాల్‌ కమిటీ సమావేశానికి తాను ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కావడం లేదని తన లేఖలో స్పష్టం చేశారు.  సమావేశానికి హాజరు కాకూడదని ఖర్గే ఇలా లేఖ రాయడం ఇది నాలుగోసారి. విపక్ష పార్టీకి చెందిన తనకు పూర్తిస్థాయి సభ్యుడి హోదా ఇచ్చే వరకు తానీ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు.

సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం అంటే సమావేశంలో పాల్గొనే హక్కు, ఓటింగ్‌ హక్కు హరించడమేనని, పైగా తన అభిప్రాయాన్ని రికార్డు కూడా చేయరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రతిపక్షాల స్వేచ్ఛను హరించే ఎత్తుగడని ధ్వజమెత్తారు. గతంలో మూడుసార్లు లేఖ రాసినా తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదంటే వారి అభిప్రాయం ఏమిటో అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. అసలు చట్టంలో ప్రత్యేక ఆహ్వానితుల విధానమే లేదన్నారు. లోక్‌పాల్‌ చట్టం అమలుకు విపక్షాలు సహకరించడం లేదని నిందించడానికే ఈ ఎత్తుగడని మండిపడ్డారు. లోక్‌పాల్‌ నియామకం, లోక్‌పాల్‌ సభ్యుల నియామకానికి సంబంధించి సిఫారసుల కోసం సెర్చి కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ ఈ రోజు సమావేశమవుతోంది.

More Telugu News