Kerala: కేరళ వాసులకు సాయపడండి : జనసైనికులకు 'ప్యాక్' పిలుపు

  • కేరళ వరద బాధితులకు అండగా నిలవాలి
  • జనసైనికులు తమ శక్తి కొలదీ కేరళకు సాయపడాలి
  • ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం 

కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది. భారీ వర్షాలతో సర్వస్వం కోల్పోయిన కేరళ వాసులను ఆదుకోవాల్సిందిగా ‘జనసేన’ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) కన్వీనర్ మాదాసు గంగాధరం తమ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు.

తమ శక్తి కొలదీ కేరళకు సాయం చేయాలని జనసైనికులను కోరారు. కొత్త దుస్తులు, ఆహార ధాన్యాలు, మందులు వంటి అత్యవసరాలను అందించాలని, జనసైనికులు బృందాలుగా ఏర్పడి ఈ క్రతువులో పాల్గొనాలని ప్యాక్ కోరింది. సెప్టెంబర్ 2న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు అని, రెండు తెలుగు రాష్ట్రాలలోని జన సైనికులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందుతోందని, ఈ సేవా కార్యక్రమాలలో కేరళ  అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు సాయపడే అంశాన్ని కూడా చేర్చాలని ప్యాక్ కోరింది.

కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 23 నుంచి పవన్ కల్యాణ్ తలపెట్టిన మలివిడత పర్యటన వాయిదా పడినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం ప్రాంతాలలో ఈ పర్యటన జరగాల్సి  వుందని అన్నారు. అయితే, ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం వల్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవ్వడం, చాలా ప్రాంతాలు జలమయం కావడంతో పర్యటన వాయిదా పడినట్టు మాదాసు గంగాధరం పేర్కొన్నారు. పవన్ పర్యటన ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని, వాతావరణం సాధారణ స్థితికి రాగానే పర్యటన ఉంటుందని తెలిపారు.

More Telugu News