gujarat: గుజరాత్ లో స్వీపర్ తో పేషంట్ కు కుట్లు వేయించిన గవర్నమెంట్ డాక్టర్లు!

  • తమాషా చూసిన వైద్యులు, నర్సులు
  • బహరూచ్ సివిల్ ఆస్పత్రిలో ఘటన
  • విచారణకు ఆదేశించిన అధికారులు

ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడానికి సామాన్యులు ఎందుకు జంకుతారో ప్రత్యక్షంగా చూపే ఘటన ఇది. గుజరాత్ లో ఓ ప్రమాదంలో తలకు గాయమై ఆసుపత్రికి వచ్చిన యువకుడికి చికిత్స చేయాల్సిన వైద్యులు అక్కడే ఉన్న స్వీపర్ చేత కుట్లు వేయించారు. ఈ సమయంలో డాక్టర్లు, నర్సులు పక్కనే నిలబడి తమాషా చూస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుజరాత్ లోని బహరూచ్ సివిల్ ఆసుపత్రికి ఓ యువకుడు తలకు గాయంతో వచ్చాడు. దీంతో వైద్యులు అక్కడే ఉన్న స్వీపర్ బ్రిజేష్ సోలంకీకి ఈ పనిని పురమాయించారు. దీంతో అతను బాధితుడి తలకు కుట్లు వేయడం ప్రారంభించాడు. తతంగం మొత్తాన్ని బాధితుడి బంధువు ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీడియా ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. స్వీపర్ చేత కుట్లు వేయించిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి రెసిడెంట్ ఆఫీసర్ ఎస్ ఆర్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

More Telugu News