Kerala: కేరళకు మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు.. ఏకంగా రూ.50 కోట్ల సాయం ప్రకటించిన వ్యాపారి!

  • కేరళ వరద బాధితులకు పోటెత్తుతున్న సాయం
  • భారీ విరాళం ప్రకటించిన కేరళ ఎన్నారై
  • పునరావాసం, ఆరోగ్యం, విద్య కోసం ఖర్చు చేస్తానని వెల్లడి

భారీ వర్షాలు, వరదల దెబ్బకు కేరళ అల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, వ్యాపార వేత్తలతో పాటు విదేశాల్లోని భారతీయులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా అబుదాబీలో ఉంటున్న భారత సంతతి వ్యాపారవేత్త డా.షంషీర్ వయలిల్ కేరళకు భారీ సాయం ప్రకటించారు. వరద బాధితుల కోసం రూ.50 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ ఓ వ్యక్తి కేరళకు ప్రకటించిన అత్యధిక సాయం ఇదే కావడం గమనార్హం.

అబుదాబి కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థ చైర్మన్ గా ఉన్న షంషీర్ కు ప్రపంచవ్యాప్తంగా 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. కేరళకు ప్రకటించిన రూ.50 కోట్ల సాయాన్ని బాధితులకు పునరావాసం, ఆరోగ్యం, విద్య కోసం ఖర్చు చేయనున్నట్లు షంషీర్ తెలిపారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా, కేరళకు ఉదారంగా సాయం చేసిన షంషీర్ కుటుంబం కేరళ నుంచే యూఏఈకి వెళ్లింది. తాజా అంచనాల ప్రకారం షంషీర్ ఆస్తుల విలువ రూ.11,832 కోట్లుగా ఉంది.

More Telugu News