Geeta Govindam: 'గీత గోవిందం' టికెట్లను బ్లాక్ చేస్తున్న హైదరాబాద్ 'సంధ్య' థియేటర్ యాజమాన్యం... కేసు పెట్టడంతో పరారీలో!

  • హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న 'గీత గోవిందం'
  • ప్రేక్షకులు ఎగబడుతుండటంతో స్వయంగా దందా
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • పరారీలో యజమాని సందీప్, మేనేజర్ రామారావు

సినిమా టికెట్లన్నీ ఆన్ లైన్ లో విక్రయించడం ప్రారంభమైన తరువాత, రిలీజైన ఒకటి రెండు రోజుల తరువాత ఎక్కడా బ్లాక్ టికెట్ల దందా కనిపించడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అధిక సంఖ్యలో థియేటర్లలో సినిమాలు విడుదల అవుతుండటం కూడా దీనికి ఓ కారణం. ఇక గత బుధవారం విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం' సినిమా, వారం రోజులు దాటినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతుండటంతో బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా, టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడుతుండటంతో స్వయంగా యాజమాన్యమే బ్లాక్ టికెట్ల దందాను ప్రారంభించింది.

చిక్కడ్ పల్లి పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఆదివారం సెకండ్ షోకు ముందు మఫ్టీలో వెళ్లి దాడులు చేయగా, బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ఏడుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 75 టికెట్లను స్వాధీనం చేసుకుని, ఆపై విచారించారు. తమకీ టికెట్లను థియేటర్ యజమానులు సుమిత్ సందీప్, మేనేజర్ రామారావు, గీతా ఆర్ట్స్ ప్రతినిధి శంకర్ లతో పాటు సుబ్బమ్మ అనే వారు ఇచ్చారని వారు చెప్పడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్లు ఇచ్చిన వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News