Kurnool District: ఆమె దగ్గర మీ సెల్ ఫోన్ నంబర్ ఎందుకుంది?: కర్నూలు పోలీస్ అధికారి కొత్త తరహా దందా

  • వ్యభిచారిణి సెల్ ఫోన్ లో నంబర్ ఉందని బెదిరింపులు
  • బ్రోకర్ పని చేస్తున్నావంటూ స్టేషన్ కు పిలిచి బేరాలు
  • వేలకు వేలు సమర్పించుకుంటున్న బాధితులు

ఇటీవల కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొంతమందికి తాను పోలీసు అధికారినని చెబుతూ ఫోన్ వస్తోంది. తమకు ఓ వ్యభిచారిణి పట్టుబడిందని, ఆమె సెల్ ఫోన్లో మీ కాంటాక్టు నంబర్ ఉందని, విచారణకు రావాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇది విచారణలో భాగమేనని తొలుత భావిస్తున్న వీరు, స్టేషన్ కు వెళ్లిన తరువాత, తదుపరి విచారణలు లేకుండా చూసుకునేందుకు సదరు పోలీసు అధికారితో బేరమాడాల్సివస్తోంది.

జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యభిచార దందా చాలా ఏళ్లుగానే సాగుతోంది. లాడ్జీల్లో సైతం 'వ్యాపారం' జోరుగానే ఉంది. పలుమార్లు వ్యభిచారిణులతో పాటు విటులూ పట్టుబడ్డారు కూడా. డైరెక్టుగా పట్టుబడిన విటులపై కేసులను మోపుతున్న పోలీసులు, ఆపై వ్యభిచారిణుల సెల్ ఫోన్లను తీసుకుని, అందులోని కాంటాక్టు లిస్టులో ఉన్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఆ వ్యభిచారి మీకు పదే పదే కాల్ చేసిందని, మీరు మధ్యవర్తిగా పనిచేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని తొలుత భయపెట్టి, ఆపై వారిని స్టేషన్ కు పిలిపించుకుని బేరమాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల పలువురు గవర్నమెంట్ ఉద్యోగులు, వ్యాపారులు, స్టూడెంట్స్ ఇలా పోలీసుల వద్దకు వెళ్లి వేలకు వేలు సమర్పించుకున్నట్టు తెలుస్తుండగా, ఈ అధికారి నిర్వాకాలపై పోలీస్ బాస్ కు ఉప్పందినట్టు సమాచారం. ఇక ఈ వసూళ్ల పర్వానికి ఆయనెలా తెర వేస్తారో వేచి చూడాలి.

More Telugu News