సెంచరీతో దుమ్ము రేపిన కోహ్లీ.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

20-08-2018 Mon 20:55
  • 191 బంతుల్లో 102 పరుగులు చేసిన కోహ్లీ
  • టెస్ట్ కెరీర్ లో 23వ శతకం
  • 450 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగుల వద్ద ఔట్ అయి తృటిలో సెంచరీని కోల్పోయిన కోహ్లీ... రెండో ఇన్నింగ్స్ లో శతకాన్ని బాదాడు. 191 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ బౌండరీతో సెంచరీ (102) చేశాడు. ఈ క్రమంలో తన టెస్ట్ కెరీర్ లో 23వ శతకాన్ని సాధించాడు.

అయితే, సెంచరీ సాధించిన వెంటనే మరో పరుగు చేసిన కోహ్లీ 103 పరుగుల వద్ద వోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. నాలుగు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసిన టీమిండియా... మొత్తం మీద 450 పరుగుల ఆధిక్యతను సాధించింది.

రహానే 18 పరుగులు, రిషబ్ పంత్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ధావన్ 44 పరుగులకు, కేఎల్ రాహుల్ 36 పరుగులకు ఔట్ కాగా... 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా పెవిలియన్ చేరాడు.