Kerala: నోరు జారాడు.. ఉద్యోగం కోల్పోయాడు.. కేరళ క్యాషియర్ ను తీసేసిన దుబాయ్ కంపెనీ!

  • కేరళ వరదల సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు
  • కంపెనీకి ఫిర్యాదు చేసిన నెటిజన్లు
  • ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన లులు గ్రూప్

పక్కవాడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సాయం చేయకపోయినా పర్లేదు కానీ, వాళ్లను మరింత బాధ పెట్టకూడదు. కానీ దుబాయ్ లో ఉంటున్న ఓ కేరళ వాసి మాత్రం ఇది మరచిపోయాడు. ప్రస్తుతం వరదలతో ఇబ్బంది పడుతున్నది తన వాళ్లే అనే విషయాన్ని కూడా విస్మరించి అసభ్యకరమైన ట్వీట్ చేశాడు. దీంతో సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు దుబాయ్ కంపెనీ ప్రకటించింది.

కేరళకు చెందిన రాహుల్ దుబాయ్ లోని బహుళజాతి కంపెనీ లులు ఇంటర్నేషనల్ గ్రూప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో కేరళ వరదల నేపథ్యంలో బాధితులకు నగదుకు బదులుగా వస్తువులు ఇవ్వాలని చాలా స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఈ సందర్భంగా ‘వరదలో చిక్కుకున్న మహిళల కోసం శానిటరీ నాప్కిన్లను పంపితే బాగుంటుంది’ అని ఓ నెటిజన్ సూచించారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. ‘కండోమ్ లు కూడా పంపాలి’ అంటూ అసభ్యకరమైన కామెంట్ చేశాడు.


దీంతో నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని కొందరు లులు గ్రూప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంపెనీ వెంటనే స్పందిస్తూ..‘సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు చేసినందుకు రాహుల్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని ప్రకటించింది. ఆ ట్వీట్ చేసిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నాననీ,  తనను క్షమించాలని వేడుకున్నప్పటికీ కంపెనీ వెనక్కు తగ్గలేదు.

More Telugu News