West Godavari District: భారీ వరద.. తెరుచుకోని రిజర్వాయర్ గేటు.. పశ్చిమ గోదావరిలో తీవ్ర ఆందోళన!

  • ఎర్రకాల్వ రిజర్వాయర్ కు పోటెత్తుతున్న వరద
  • 27 వేల క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు
  • తెరుచుకోని జాలాశయం మూడో గేటు

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్ర కాల్వ రిజర్వాయర్ కు నీటిమట్టం పోటెత్తింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో 27,000 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు విడుదల చేశారు.

అయితే కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ రిజర్వాయర్ మూడో గేటు తెరుచుకోకపోవడంతో జలాశయం ఎడమవైపు కరకట్ట బీటలు వారుతోంది. దీంతో దిగువ గ్రామాలైన లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు వర్షాల కారణంగా జిల్లాలో నదులన్నీ పొంగిపొర్లడంతో జంగారెడ్డి గూడెంలోని గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన 700 మంది భక్తులు ఆలయం వద్దే చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వీరిని సురక్షితంగా కొండపైకి తీసుకెళ్లారు. పోలీసుల సమాచారంతో అక్కడకు చేరుకున్న విపత్తు నిర్వహణ అధికారులు.. ఇప్పటివరకూ దాదాపు 200 మందిని కాపాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమగోదావరి జిల్లా  కలెక్టర్ అందజేశారు. సహాయ చర్యలను ముమ్మరం చేసి బాధితులను ఆదుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు.

More Telugu News