Facebook: 'ఫేస్ బుక్' ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారం: మైనర్ పై కిడ్నాప్ కేసు పెట్టాలా? వద్దా?.. పోలీసుల మీమాంస!

  • ఇంట్లో చెప్పకుండా కలుసుకున్న బాలుడు, బాలిక
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలిక
  • బాలుడిపై కేసు విషయంలో మల్లగుల్లాలు

9 వ తరగతి చదువుతున్న బాలిక, ఇంటర్ చదువుతున్న బాలుడు. ఇద్దరూ మైనర్లే. ఫేస్ బుక్ ఖాతాల్లో అమ్మాయి మెడిసిన్ చదువుతున్నానని పరిచయం చేసుకోగా, అబ్బాయి ఐఐటీ చదువుతున్నానని చెప్పుకున్నాడు. ఇద్దరి మధ్యా పరిచయం వ్యక్తిగతంగా కలుసుకోవాలన్నంత వరకూ వెళ్లగా, అమలాపురం నుంచి అమ్మాయి, గుంటూరు నుంచి అబ్బాయి వచ్చి రాజమహేంద్రవరంలో కలిశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై కిడ్నాప్ కేసు పెట్టిన పోలీసులు, వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఆ బాలుడిపై కిడ్నాప్ కేసును కొనసాగించాలా? వద్దా? అమలాపురం టౌన్ పోలీసుల మీమాంస ఇది. జరిగిన ఘటనలో ఇద్దరిదీ తప్పుంది. అయితే, ఈ తరహా కేసుల్లో బాలికలను కేవలం బాధితురాళ్లగానే పరిగణించాలి. కానీ, ఆ అమ్మాయి కూడా ఇష్టంతోనే అబ్బాయిని కలిసేందుకు వెళ్లింది. కేసు కొనసాగిస్తే, బాలుడిపై కిడ్నాప్, అత్యాచారం అభియోగాలు మోపాల్సివుంటుంది.

ప్రస్తుతం ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు, బాలుడిని జువైనల్ కోర్టు ముందు హాజరు పరిచారు. తదుపరి మరింత లోతుగా విచారించి కేసు కొనసాగించే విషయమై తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తే, వారు దానితో ఏం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలని, లేకుంటే ఇటువంటి అనర్థాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

More Telugu News