10 ఉద్యోగాలకు 6,077 మంది దరఖాస్తు.. జాయింట్ సెక్రటరీ హోదా కోసం ఎగబడుతున్న ప్రైవేటు నిపుణులు!

20-08-2018 Mon 09:42
  • ప్రభుత్వ విభాగాల్లో ‘ప్రైవేటు’కు కేంద్రం ఆహ్వానం
  • భారీగా స్పందించిన నిపుణులు
  • దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్న కేంద్రం

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రైవేటు రంగంలోని నిపుణులను నియమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్, వ్యవసాయం, రవాణా, నౌకాయానం, పర్యావరణం-అడవులు, వాణిజ్యం, విమానయానం తదితర మంత్రిత్వ శాఖల్లో 10 మంది జాయింట్ సెక్రటరీల నియామకానికి నోటిఫికేషన్ కూడా జారీచేసింది.

తాజాగా ఈ పది పోస్టులకు ఏకంగా 6,077 మంది ప్రైవేటు నిపుణులు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటిలో ఓ పోస్టుకు గరిష్టంగా 1,100 దరఖాస్తులు రాగా, మరో పోస్టుకు కనిష్టంగా 290 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు.

సాధారణంగా జాయింట్ సెక్రటరీ హోదా ఉన్న పోస్టులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సర్వీస్ అధికారులతో భర్తీ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో 6,500 ఐఏఎస్ అధికారుల అవసరం ఉండగా, కేవలం 5,004 మంది మాత్రమే సర్వీసులో ఉన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నీతి ఆయోగ్ సంస్థ ప్రైవేటు రంగంలోని నిపుణుల సేవలను తీసుకోవాలని గతంలో కేంద్రానికి సూచించింది.