Atal Bihari Vajpayee: వాజ్‌పేయికి స్కానింగ్ చేయించుకోవడం అంటే భయం: మిత్రుడు ఎంఎం ఘటేగ్‌

  • సీటీ స్కాన్ కు నిరాకరించిన వాజ్‌పేయి
  • స్నేహం విషయంలో స్థాయులను ఆలోచించని గొప్ప వ్యక్తి
  • హిందూ ముస్లింలు అందరూ భరతమాత బిడ్డలే అన్న భారతీయుడు

మచ్చ లేని రాజకీయ నాయకుడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈ లోకాన్ని వీడిపోయినా ఆయన  స్నేహితులు, రాజకీయ ప్రముఖులు, బీజేపీ నేతలు ఆయనతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉన్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన సన్నిహితుడు ఎంఎం ఘటేగ్‌ కూడా వాజ్‌పేయీతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని... స్నేహానికి విలువిచ్చిన మహానీయుడని కొనియాడారు. స్నేహం విషయంలో స్థాయులను ఆలోచించే వ్యక్తి కాదని, ఎవరైనా స్నేహితులు దారిలో కనిపిస్తే వాహనం దిగి మరీ మాట్లాడేవారని చెప్పారు. తనకు రక్షణ అవసరం లేదని తానో సాధారణ వ్యక్తిని అని చెప్పిన ఉన్నత వ్యక్తిత్వం వాజ్ పేయిదని ఎంఎం ఘటేగ్‌ తెలిపారు.

ఆయనకు సీటీ స్కాన్ అంటే భయం అని చెప్పారు. గతంలో ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు... ఆయనకు సీటీ స్కాన్ చేయాల్సిందిగా వైద్యులు సూచించారని... ఆయన దానికి నిరాకరించారని ఘటేగ్ గుర్తు చేసుకున్నారు. ‘ఈ డబ్బాలోకి (స్కాన్‌ మెషీన్‌) నేను వెళ్లను. ఆదో అగాథంలాగా అనిపిస్తోంది‘ అని వాజ్‌పేయి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆరోజు ఆ పరీక్ష చేయించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని బాధను వ్యక్తం చేశారు. ‘అటల్‌జీ పాకిస్థాన్‌లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తారు’ అని పాకిస్థాన్ ప్రధానులయిన బెనజీర్‌ భుట్టో, నవాజ్‌ షరీఫ్‌ ఎప్పుడూ అంటుండేవారని, ఆయనకున్న క్రేజ్‌ అలాంటిదని అన్నారు.

మత విద్వేషాలపై చెబుతూ, ‘హిందూ-ముస్లింలు ఇద్దరూ సమానమే. ఒకవేళ ఇద్దరి మధ్య తగాదాలు చోటు చేసుకుంటే హిందూ, ముస్లింలు ఎవరు చనిపోయినా వాళ్లంతా భరతమాత బిడ్డలని మాత్రం మర్చిపోకు’ అంటుండేవారని ఎంఎం ఘటేగ్‌ చెప్పారు. అటల్‌జీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవని... అప్పట్లో ప్రతిరోజూ ఆయన నివాసానికి వెళ్లేవాడినన్న ఎంఎం ఘటేగ్‌ ఆయన లేరన్న నిజాన్ని ఇప్పుడు జీర్ణించుకోవడానికే కష్టంగా ఉందన్నారు.

More Telugu News