vija sekhar sharma: 12 వేల కోట్ల సంపద ఉంది.. కేరళకు 10వేలు మాత్రమే విరాళం.. చిన్న బుద్ధిని చాటుకున్న పేటీఎం అధినేత

  • వరద బాధితులకు రూ. 10 వేల విరాళం ఇచ్చిన విజయ్ శేఖర్ శర్మ
  • జనాల నుంచి వేల కోట్లు సంపాదించి.. ముష్టి వేస్తావా? అంటూ నెటిజెన్ల ఫైర్
  • ట్వీట్ ను తొలగించిన పేటీఎం అధినేత

ఆయన సంపద అక్షరాలా రూ. 12 వేల కోట్లు. తరతరాలు కూర్చుని తిన్నా తరగదు. దీనికి ప్రతి రోజు మరి కొన్ని కోట్లు జమవుతున్నాయే కానీ, తరగడం లేదు. ఎంతుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? పెద్ద శ్రీమంతుడే అయినప్పటికీ... తోటివారికి సాయం చేసే విషయంలో మాత్రం చిన్నవాడిగా మిగిలిపోయారు. ఆయనే... పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ.

కేరళ వరద బాధితుల కష్టాలు చూసి, ఆయన కరిగిపోయారు. పెద్ద మనసుతో రూ. 10 వేలు విరాళం ఇచ్చారు. అంతేకాదు, తానేదో గొప్ప పని చేసినట్టు ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన దానానికి రుజువుగా రసీదును కూడా జత చేశారు. పనిలో పనిగా విరాళాలను ఇచ్చేందుకు తమ పేటీఎంను వాడుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఈయన దానశీలతను చూసిన నెటిజెన్లకు ఒళ్లు మండిపోయింది. ట్విట్టర్ వేదికగా ఆయనను ఏకిపారేశారు.

సమాజంలో నీ స్థాయి ఏంటి? నీవిచ్చే విరాళం ఏంటి? అంటూ కొందరు... జనాల సొమ్ముతో రూ. 12వేల కోట్లు సంపాదించి... ఇప్పుడు అదే జనాలకు రూ. 10 వేల ముష్టి వేస్తావా? అంటూ మరికొందరు దుమ్మెత్తి పోశారు. డబ్బు వెనక్కి తీసుకుని నీ పెంపుడు కుక్కలకు పెట్టు అంటూ కొందరు విమర్శించారు. విమర్శకుల దెబ్బకు విజయ్ శేఖర్ శర్మ వెంటనే ట్విట్టర్ నుంచి ట్వీట్ ను తొలగించారు. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజెన్లు.. దాన్ని వైరల్ గా మార్చారు.

More Telugu News