Snakes: దయనీయంగా దివిసీమ.. ఒక్కరోజే పాము కాటుకు గురైన 24 మంది!

  • పాముల నుండి కాపాడండి మహాప్రభో అంటున్న దివిసీమ వాసులు
  • వరదల వల్ల కొట్టుకొచ్చిన పాములతో భయాందోళనలో ప్రజలు 
  • ఒక్క రోజే  24 మంది పాము కాటుకు గురి

దివిసీమ వాసులకు ఇప్పుడు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఎప్పుడు ఎటు నుండి పాములొచ్చి ప్రాణాలు హరిస్తాయో అనే భయం పట్టుకుంది. దివిసీమను ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలతో కొట్టుకొచ్చిన పాములతో ప్రజలు సహవాసం చేస్తున్న పరిస్థితి నెలకొంది .

ఇప్పటికే పలువురు పాము కాటుకు గురయ్యారు. ఆదివారం ఒక్కరోజే అవనిగడ్డ ఆస్పత్రికి 24 మంది పాముకాటుకు గురైనవారు వచ్చారంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. పాము కాటుకు గురైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విపరీతంగా వున్న పాముల సంచారంతో దివిసీమ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

అలాగే వరదల్లో చిక్కుకున్న గ్రామాలు మురికి కూపాలుగా వుండటం, మొత్తం అపరిశుభ్రంగా తయారవటం కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వీలైనంత త్వరగా వరద వల్ల పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని, పాముల బెడద నుండి తమను కాపాడాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.

More Telugu News