Kerala: కేరళలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉపసంహరణ

  •  పాతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకుళంలో మాత్రం రెడ్‌ అలర్ట్‌ కొనసాగింపు
  • మరో రెండు జిల్లాల్లో ఎల్లో, గ్రీన్‌ అలెర్ట్‌
  • కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు

ప్రకృతి విలయతాండవంతో కేరళ కన్నీటి సంద్రమైంది. భారీవర్షాలు, వరదలు కేరళను   ముంచెత్తాయి. గత శతాబ్దకాలంగా ఎన్నడూ లేనంతగా వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పరిస్థితి చెయ్యిదాటిపోవటంతో 11 జిల్లాల్లో శనివారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అయితే ఆదివారం పరిస్థితి కాస్త కుదుట పడటంతో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నారు. ఇంకా పాతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకుళంలో మాత్రం రెడ్‌ అలర్ట్‌ కొనసాగిస్తున్నారు. మరో రెండు జిల్లాల్లో ఎల్లో, గ్రీన్‌ అలెర్ట్‌లను ప్రకటించారు. సోమవారానికి వాతావరణ పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చని ఐఎండీ అధికారులు భావిస్తున్నారు.

   వరదలకు కొండ చరియలు విరిగిపడి కొందరు, వరదల్లో చిక్కుకుని కొందరు, మొత్తంగా ఇప్పటివరకు 385 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.   నీరు, ఆహారం లేక అలమటిస్తున్నారు. ఇప్పటి వరకు 3.14 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక బృందాలు పని చేస్తున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం కూలిపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడి పాలక్కడ్‌లో కొందరు మృతి చెందారు. వీరిలో ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
   
కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు, త్రివిధ దళాలు ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కేరళ ప్రజల అవసరార్థం భారతీయ రైల్వే 14లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది.  

More Telugu News