Social Media: వయసు పెద్దగా చెప్పుకుని మైనర్ల లవ్... సోషల్ మీడియా తెచ్చిన చేటు!

  • పిల్లలను చెడగొడుతున్న ప్రేమలు
  • రాజమహేంద్రవరం పారిపోయిన మైనర్లు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

సోషల్ మీడియా పరిచయాలు మైనర్లను ఎంతగా చెడగొడుతున్నాయో చెప్పకనే చెబుతున్న ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన ఈ సంఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ప్రేమతో తమకు కొనిపెట్టిన స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి పెడదారి పట్టారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. అత్యుత్సాహంతో వ్యవహరించారు. 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక, తాను మెడిసిన్ స్టూడెంట్ నని, 17 ఏళ్ల ఇంటర్ అబ్బాయి ఐఐటీ చదువుతున్నానని చెప్పుకుంటూ ఫేస్ బుక్ లో ఖాతాలు తెరిచారు. వారిద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. మాటలు కలిశాయి. ఫేస్ బుక్ పరిచయం వాట్స్ యాప్ కు మారింది.

కబుర్లతో కొంతకాలం గడిపిన తరువాత, ఇదే ప్రేమని భావించారు. ఇక ఎలాగైనా కలవాలని ఇద్దరూ అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. అంతవరకూ ఒకరిని ఒకరు ప్రత్యక్షంగా కలుసుకున్నదే లేదు. తాను అబద్ధం చెప్పానని అబ్బాయిగానీ, అమ్మాయిగానీ అనుకోలేదు. తరువాత ఏం జరుగుతుందన్న ఆలోచన వాళ్ల మధ్య లేదు. ఆకర్షణనే ప్రేమగా భావించేశారు.

ఈ క్రమంలో ఇద్దరూ రాజమహేంద్రవరంలో కలవాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు నుంచి అబ్బాయి, అమలాపురం నుంచి అమ్మాయి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి, రాజమండ్రిలో కలిశారు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లి చేసుకోవాలన్నది వీరి ఆలోచన. వీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత విషయం ఇరు కుటుంబాలకూ తెలిసింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మైనర్లయిన పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే, ఇలాగే జరుగుతుందని పోలీసులు వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు.

More Telugu News