Jagan: చినబాబు నుంచి చంద్రబాబు వరకూ బయటకొస్తారు... సీబీఐ విచారణకు సిద్ధమా?: పల్నాడు గనుల వ్యవహారంపై జగన్ సవాల్

  • పల్నాడు ప్రాంతంలో కోటి మెట్రిక్ టన్నుల ఖనిజ దోపిడీ
  • సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్
  • దోపిడీ వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆరోపణ

పల్నాడు ప్రాంతంలో జరిగిన గనుల దోపిడీపై తన చేతిలోని సీబీసీఐడీతో కాకుండా, సీబీఐతో విచారణ జరిపించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం 10 గంటల సమయంలో ఓ ట్వీట్ పెట్టారు.

"గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో ఉన్న దర్యాఫ్తు సంస్థకు ఈ కేసును అప్పగించి, పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేశారని తేలుతోంది. ప్రతి రోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ్వరికీ తెలియదని అనుకోవాలా? ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీలో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా? రాష్ట్రంలో జరుగుతున్న అనేక దోపిడీల్లో ఇదొక దోపిడీ మాత్రమే" అని జగన్ నిప్పులు చెరిగారు.

"ఇసుక దగ్గరి నుంచి మొదలుపెడితే, ఏ సహజ వనరులనూ మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తరువాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.

'మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది. మాకూ సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు' అని చంద్రబాబు వ్యాఖ్యానించలేదా? సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. పల్నాడు గనుల దోపిడీ వ్యవహారంలో వున్న వ్యక్తిని సీఐడీ చేత దర్యాఫ్తు చేయించడం అపహాస్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐలాంటి ఏజన్సీతోనే గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలి. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయి" అని వ్యాఖ్యానించారు.

More Telugu News