NDA: తగ్గుతున్న మోదీ గ్రాఫ్... మహాకూటమితో ఎన్డీయేకు కష్టకాలం!: ఇండియా టుడే సర్వే

  • ఆరు నెలల క్రితంతో పోలిస్తే తగ్గిన మోదీ గ్రాఫ్
  • మహాకూటమి ఏర్పడితే బీజేపీకి పెను నష్టం
  • 228 సీట్లకు పరిమితం కానున్న ఎన్డీయే

ఆరు నెలల కిందటితో పోలిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ దిగజారిందని 'ఇండియా టుడే' నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురిని ప్రశ్నించిన 'ఇండియా టుడే', వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోరుకుంటున్న మహా కూటమి ఏర్పడితే ఎన్డీయేకు కష్టం తప్పదని పేర్కొంది.

తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, తెలుగుదేశం వంటి పార్టీలు ఏకమైతే, బీజేపీకి 194 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ మిత్ర పక్షాలకు 34 సీట్ల వరకూ రావచ్చని, మొత్తంగా 228 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇదే సమయంలో మహాకూటమికి 224 సీట్ల వరకూ వస్తాయని, ఇతర చిన్న పార్టీలు అత్యంత కీలకమవుతాయని తెలిపింది.

ఇక మహాకూటమి ఏర్పడకుంటే బీజేపీ సొంతంగా 245 సీట్ల వరకూ గెలుస్తుందని, ఎన్డీయేకు 281 సీట్లు రావచ్చని పేర్కొంది. ఆరు నెలల కింద నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు వస్తాయని తేలిందని ఇండియా టుడే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా 52 శాతం నుంచి 49 శాతానికి తగ్గింది. నిరుద్యోగం అతిపెద్ద సమస్యని 34 శాతం మంది, ధరలు పెరుగుతున్నాయని 24 శాతం మంది, అవినీతి పెను సమస్యని 18 శాతం మంది వెల్లడించడం గమనార్హం.

More Telugu News